ప్చ్‌...టైం లేదు...!

ప్చ్‌...టైం లేదు...!

Posted May 5,2018 in Other.

Sowjanya T
40 Friends 171 Views
ప్చ్‌...టైం లేదు...!

సమయపాలనకు సంబంధించి చేయాల్సినవి...  

* మనలో చాలామంది ఏ రోజు చేయాల్సిన పనుల్ని ఆ రోజు రాసుకుంటాం కదా... వాటిలో ముఖ్యమైనవాటిని క్రమపద్ధతిలో రాసుకోవాలి. మొదట ఏవి ముఖ్యమో రాసుకుని ఆ ప్రకారం ఒక్కోదాన్ని పూర్తిచేసుకుంటూ వెళ్లాలి. అంటే మీ జాబితాలో ఒక రోజులో మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ ఉండాలి.  
* సమయాన్ని బానిసగా చేసుకునేవారికి కొన్ని ప్రత్యేకతలు సహజంగానే ఉంటాయి. వాటిల్లో ఒకటి ఏ వస్తువూ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా చేసుకోవడం. ఇల్లూ, ఆఫీసు ఎక్కడయినా సరే ఎప్పటికప్పుడు వద్దనుకున్న వస్తువుల్నీ, కాగితాల్నీ తీసేయాలి. ముఖ్యమైనవి అందుబాటులో పెట్టుకోవాలి. జపాన్‌లో పరిశ్రమల్లో పనిచేసేవారు ఇదే సూత్రాన్ని పాటిస్తారట. సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు అనవసరం అనే పనిముట్లను పారేస్తారు. అవసరం అనుకుంటే శుభ్రం చేసి ఓ చోట పెట్టుకుంటారు. అది పరిశ్రమల్లో చేసినా, మనం మనకు తగినట్లుగా కూడా అన్వయించుకోవచ్చు. ఆఫీసులోకి వెళ్లాక మొదటి పదిహేను నిమిషాలూ, సాయంత్రం ఇంటికొచ్చేముందు ఆఖరి పదిహేను నిమిషాలు సర్దుకోవడానికి పెట్టుకోవాలి. ఇందులో కేవలం సర్దుకోవడమే కాదు, మర్నాడు చేయాల్సిన పనులకు సంబంధించిన జాబితా కూడా కొంత తయారుచేసుకుంటే మర్నాడు ఎంతో సమయం మిగిలినట్లు అనిపిస్తుంది.  
* ఒక రోజును సమర్థవంతంగా పూర్తిచేసేలా చూసుకోవాలి. ఇవాళ ఒక్కరోజును నేను సమయాన్ని శాసించగలను అని అనుకోవాలి. రోజంతా అవసరంలేదు. కేవలం రెండు గంటలు పెట్టుకుని పనుల్ని అనుకున్న సమయానికి పూర్తిచేసేలా చూసుకున్నా చాలు.   రెండు గంటల్లో ఈ ఆరు పనులు నాకు ముఖ్యం. వాటిని పూర్తిచేస్తా అనుకోవాలి. ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు.  
* అనుకున్న పనులు పూర్తిచేశాక కనీసం ఐదు నిమిషాలు విరామం తీసుకోవాలి. నడవడం, ఓ పండు తినడం, ఇతరులతో రెండు నిమిషాలు మాట్లాడటం ఇలా ఏదో ఒకటి చేయాలి. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని అధ్యయనాలే చెబుతున్నాయి.  
* మీ కోసం కూడా కొంత కేటాయించుకోవాలి. అప్పుడు నచ్చిన పని చేసేలా చూసుకోవాలి. ఒకవేళ సెలవు రోజే సమయం ఉంటుందనుకుంటే.. కొన్ని పనులే పెట్టుకుని ఇన్నిగంటలే పనిచేస్తా.. మిగిలిన సమయం నాదే అని అనుకోవాలి. నిద్రపోవడం, టీవీ చూడటం, సౌందర్య    సంరక్షణ... ఇలా అన్నింటికీ సమయం పెట్టుకోవడమూ ముఖ్యమే. దానివల్ల మిమ్మల్ని మీరు రీఛార్జి చేసుకున్నవారవుతారు. అది మర్నాడు మీకు ఎంతో మేలుచేస్తుంది. అలసటనూ దూరంచేస్తుంది.  
* ప్రతి పనిని ఓ ఐదు నిమిషాలు ముందు మొదలుపెట్టేలా చూసుకోవాలి. బస్టాప్‌కి వెళ్తున్నా, ఆఫీసులో ఓ ప్రాజెక్టు మొదలుపెట్టినా... అనుకున్నదానికంటే ఐదు నిమిషాలు ముందు పెట్టుకుంటే... కంగారూ, ఒత్తిడీ ఉండదు. నిదానంగా, ఆలోచించి ప్రణాళిక ప్రకారం పూర్తిచేయగలుగుతాం.