ఎండకు ఎండ.. వానకు వాన

తెలంగాణలో విరుద్ధ వాతావరణం

Posted May 5,2018 in Other.

Sowjanya T
40 Friends 157 Views
ఎండకు ఎండ.. వానకు వాన

 

హైదరాబాద్‌: వాతావరణంలో, గాలుల్లో ఏర్పడిన మార్పుల కారణంగా తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. రెండు పరస్పర విరుద్ధ దిశల నుంచి వీచే గాలులు ఒక ప్రాంతానికి రాగానే నెమ్మదించి ప్రవాహం ఆగుతుంది. ఇలా కొన్ని వందల కిలోమీటర్ల దూరం పాటు గాలుల ప్రవాహం స్తంభించడం వల్ల దాని చుట్టుపక్కల ప్రాంతాల వాతావరణంలో మార్పులొస్తాయి. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు భూమట్టానికి 900 మీటర్ల ఎత్తులో వందల కిలోమీటర్ల దూరం ఇలా గాలుల ఒకేచోట ఆగిపోతున్నాయి. ఈ ప్రభావం వల్ల ఉత్తర కర్ణాటకలోని బీదర్‌ తదితర
ప్రాంతాలకు దగ్గరగా ఉన్న హైదరాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ పాత జిల్లాల పరిధిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. గురు
వారం నుంచి 4 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయి.

మరోవైపు తూర్పు బిహార్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకూ ఉపరితల ద్రోణి భూమట్టానికి కిలోమీటరున్నర ఎత్తులో ఉంది. ఉత్తర గాలులు వల్ల వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో తేమ గాలులు వచ్చినప్పుడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి స్వల్పంగా వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 108 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వర్షాలు లేని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశమున్నందున ఎండలు మండిపోనున్నాయి. బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.5, హైదరాబాద్‌లో 39.3 డిగ్రీలుంది. ఇవి ఇంకా పెరిగే సూచనలున్నాయి. అక్కడక్కడ వర్షాలు పడుతున్నందున విద్యుత్తు వినియోగం 7100 మెగావాట్లకు తగ్గింది. వినియోగంలో 30 శాతం వరకూ తగ్గడంతో విద్యుత్‌ కొనుగోళ్లు తగ్గించినట్లు ట్రాన్స్‌కో వెల్లడించింది.