చీకటి ఖండంలో చీలిక!

రెండుగా విడిపోనున్న ఆఫ్రికా
భూ ఫలకాల్లో కదలికే కారణం
5 కోట్ల ఏళ్లలో అద్భుతం ఆవిష్కారం

Posted April 4,2018 in Other.

Sowjanya T
40 Friends 202 Views
చీకటి ఖండంలో చీలిక!
ఈ భూమండలంపై ఒకప్పుడు ఖండాలు లేవు. సముద్రాలు విడివిడిగా లేవు. ఖండాంతర చలనం మూలంగా భూమి ముక్కలు ముక్కలుగా విడిపోవటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. సుమారు 17 కోట్ల సంవత్సరాల క్రితం ఒక్కటిగానే ఉండే భూమి ఆ తర్వాత ఖండఖండాలుగా విడిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాలు.. భూమి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి విడిపోతూ వస్తున్న ప్రక్రియ ఫలితంగా ఏర్పడినవే. ఇదే క్రమంలో మరొక అద్భుతం జరగబోతోంది. అతిపెద్దదైన ఆఫ్రికా ఖండం రెండు ముక్కలు కాబోతోంది. భూగర్భంలో ఖండాంతర చలనం వల్ల ఆఫ్రికా ఖండం వచ్చే 5 కోట్ల సంవత్సరాల వ్యవధిలో రెండుగా విడిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవల కెన్యాలో చోటుచేసుకున్న ఉదంతం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది.

ఇదీ కొత్త ఖండం 
ఆఫ్రికా ఖండానికి ఉత్తరాన గల గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ నుంచి దక్షిణ భాగంలోని జింబాబ్వే వరకూ దాదాపు 3,000 కిలోమీటర్ల పొడవునా గ్రేట్‌ రిఫ్ట్‌ వ్యాలీ విస్తరించి ఉంది. శాస్త్రవేత్తల అనుమానాలు నిజమై ఎన్నో ఏళ్ల తర్వాత ఆఫ్రికా రెండు ముక్కలుగా విడిపోతే కొత్తగా ఏర్పడే తూర్పు ఆఫ్రికా ఖండంలో ప్రస్తుత సొమాలియా, కెన్యా లోని నైరుతి భాగం, ఇథియోపియా, టాంజానియా దేశాలు ఉంటాయి.

ఎవరూ గుర్తించలేని విధంగా.. 
ఆఫ్రికా ఖండం విడిపోవచ్చు. కానీ అది మనిషి గుర్తించలేని విధంగా జరుగుతుంది. అది కూడా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కనీసం 5 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు- అని లండన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడైన లూసియా పెరెజ్‌ డియాజ్‌ పేర్కొన్నారు. భూమి చీలిక వేగవంతం అవుతోందనే దానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయని, అనూహ్యమైన పరిణామాలు దాన్ని సూచిస్తాయని వివరించారు. తీవ్రమైన భూకంపాలు, రహదార్లు చీలిపోవటం, భూమి విచ్చుకొని లోతైన చీలిక ఏర్పడటం... వంటి సంకేతాల ప్రకారం, కొత్త ఖండం ఏర్పాటు ప్రక్రియ మొదలైనట్లు భావించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

దూరం జరుగుతున్న తూర్పు ఆఫ్రికా! 
ఆఫ్రికా ఖండంలోని తూర్పు భాగం విడిపోతోందని శాస్త్రవేత్తల అంచనా. దీనికి మద్దతుగా కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తున్నారు. 
తూర్పు ఆఫ్రికా దిగువన 3,100 మైళ్ల పొడవునా భూ ఫలకాల్లో (టెక్టానిక్‌ ప్లేట్లు) కదలిక కనిపిస్తోంది. దీన్ని ఈస్ట్‌ ఆఫ్రికన్‌ రిఫ్ట్‌ సిస్టమ్‌ (ఈఏఆర్‌ఎస్‌) అని వ్యవహరిస్తున్నారు. 
ఆఫ్రికా టెక్టానిక్‌ ప్లేట్‌, సొమాలియన్‌, నుబియన్‌ పలకలుగా విడిపోయింది. ఇవి రెండూ పరస్పరం వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. దాని ఫలితమే ఈ పరిణామం. 
దీనివల్ల భూమి కింద నెమ్మదిగా చీలిక ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ చీలిక సంవత్సరానికి కొన్ని మిల్లీమీటర్ల మేరకు ఉంది. 
కొన్ని కోట్ల సంవత్సరాల నాటికి ఇది పెద్దదై ఆఫ్రికా ఖండాన్ని రెండు ముక్కలు చేస్తుంది. మధ్యలో సముద్రం తేలుతుంది.

దక్షిణ అమెరికా అలాగే విడిపోయింది.. 
దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలను నిశితంగా పరిశీలిస్తే.. ఒకప్పుడు ఇవి కలిసే ఉండేవని.. విడిపోయిన రెండు భాగాలని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే ఈ విషయం తేలిపోతుంది. 
దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలు 13 కోట్ల సంవత్సరాల క్రితం కలిసే ఉండేవి. భూ ఫలకాల్లో అనూహ్యమైన కదలికల ఫలితంగా ఇవి వేరుపడి, ఒక దానికొకటి దూరంగా జరిగాయి. 
కానీ ఇది అంత సులువైన ప్రక్రియ కాదు. భూమిపై ఎన్నో బాహ్య, అంతర్గత మార్పులు చోటుచేసుకున్న తర్వాత చివరిగా చీలిక వస్తుంది. అది పూర్తిగా విడిపోయి, మధ్యలో సముద్రం తేలి ప్రత్యేక ఖండం ఏర్పడటానికి ఎంతో సమయం పడుతుంది.

నిలువునా చీలిన భూమి! 
పశ్చిమ కెన్యాలోని గ్రేట్‌ రిఫ్ట్‌ వ్యాలీలో గత నెలలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసిన తర్వాత భూమి నిలువునా చీలిపోయింది. దాదాపు 65 అడుగుల వెడల్పు, 50 అడుగుల లోతు గల అతిపెద్ద చీలిక ఏర్పడింది. ఇది నెమ్మదిగా పెరుగుతూ ఉండటంతో శాస్త్రవేత్తల్లో సందేహాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఆఫ్రికా ఖండం రెండు ముక్కలుగా విడిపోతుందని, అందుకు ఇది సంకేతమని అభిప్రాయపడటం మొదలు పెట్టారు. భూగర్భంలో ఖండాంతర పలకలు కదులుతున్నాయి, దీనివల్ల ఆఫ్రికా రెండుగా విడిపోతోంది- అని ఇజ్రాయెల్‌లోని బెన్‌- గురియన్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ రాన్‌ అవిని పేర్కొన్నారు.